ఇటీవల గద్దర్ అవార్డులకు ఎంపికైన సినిమాల జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈటీవీ విన్ అధ్వర్యంలో నిన్న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “ఈసారి గద్దర్ అవార్డుల ఎంపికలో తెలంగాణ ప్రభుత్వం అసలు జోక్యం చేసుకోలేదు. అవార్డుల కోసం ఎవరూ లాబీయింగ్ చేయలేదు. కనుక ఈసారి మంచి ప్రతిభ కలిగిన అర్హులైన కొత్త నటీనటులు, దర్శకులకు గద్దర్ అవార్డులు లభించాయి.
ఒకవేళ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉంటే వీరెవరికీ అవార్డులు వచ్చేవి కావు. ఈసారి గద్దర్ అవార్డుల ఎంపిక చాలా నిష్పక్షపాతంగా, కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ఇందుకు జ్యూరీకి మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకున్తున్నాము,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, “తెలుగు సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఏటా అవార్డులు ఇచ్చి సినీ పరిశ్రమని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.