గత ప్రభుత్వం బతుకమ్మ పండగకు ముందు రాష్ట్రంలో అర్హులైన మహిళలకు రెండేసి చీరలు చొప్పున ఉచితంగా అందించేది. బతుకమ్మ చీరల తయారీ వలన రాష్ట్రంలో లక్షలమంది చేనేత, మరమగ్గం కార్మికులను ఏడాది పొడవునా పని, ఆదాయం లభిస్తుండేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆనవాయితీని పక్కన పెట్టేసి విమర్శలపాలవుతోంది. కనుక మళ్ళీ ఆ పధకం మొదలుపెట్టింది. కానీ బతుకమ్మ పండగకు బదులు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజున అంటే నవంబర్ 19న చీరల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందిరా మహిళా శక్తి పేరుతో ఇందిరా గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో ఫోటోలు ముద్రించిన ప్యాకట్లలో ఇప్పటికే చీరలు పంపిణీకి సిద్దమయ్యాయి.
అయితే రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ కాకుండా కేవలం మహిళా సంఘాలకు మాత్రమే రెండేసి చీరలు చొప్పున పంపిణీ చేయబోతోంది.
బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల సొంత పండగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీక వంటిది. కనుక ఆ పండగకు ముందు బతుకమ్మ పేరుతో రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ చీరలు పంచితే, దాని ప్రభావం ఒకలా ఉంటుంది. అదే... తెలంగాణతో సంబంధమే లేని ఇందిరా గాంధీ పుట్టిన రోజున ఆమె పేరుతో కొందరికే చీరలు పంపిణీ చేస్తే ఆ ప్రభావం ప్రజలపై వేరేలా ఉంటుంది కదా?
అయినా పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని అమలుచేస్తున్నప్పుడు గత ప్రభుత్వం అమలుచేసిన బతుకమ్మ చీరల పధకం అమలు చేయడానికి అభ్యంతరం దేనికి?