పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వరుసగా విచారణ జరిపి 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇస్తూ, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు. దీంతో స్పీకర్ స్థాయిలో ఈ కథ సమాప్తం అయ్యింది.
కానీ వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. దానిపై స్పందించిన సుప్రీంకోర్టు ఆదేశం మేరకే స్పీకర్ ఈ విచారణ ముగించారు. కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది.
ఒకవేళ సుప్రీంకోర్టు వారు పార్టీ ఫిరాయించారని నిర్ధారించి అనర్హత వేటు వేయాలనుకుంటే దాని నుంచి తప్పించుకునేందుకు అందరూ ముందుగానే తమ పదవులకు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నట్లుగా ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయాన్ని గౌరవించి అనర్హత పిటిషన్లు కొట్టివేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బవుతుంది.