రాజీనామా ఆలోచనలో జీవన్ రెడ్డి?

March 14, 2026


img

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో ఆయన అనుచరులకు, సూచించినవారికీ అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి, పార్టీలో సీనియర్‌ననే గౌరవం లేనప్పుడు ఉండి ఏం లాభం? అని అన్నారు.

అంతకు ముందు బీఆర్ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే, గాంధీ భవన్‌లో పార్టీ సమావేశానికి హాజరైనప్పుడు జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళిపోయారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉండలేనని రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలని తన సన్నిహితుల వద్ద అన్నారు.

కానీ రాజీనామా చేయబోతున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానానికి, సిఎం రేవంత్‌ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌కి తెలిసేలా చేశారు. కనుక వారి స్పందన చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని మార్చి 25 వరకు గడువు పెట్టుకొని ఉండవచ్చు.

జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలియగానే బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆయనతో తెర వెనుక సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరి జీవన్ రెడ్డి నిజంగా రాజీనామా చేస్తారా? లేదా సిఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ఆయనతో మాట్లాడి నచ్చజెప్పి పార్టీ వీడకుండా ఆపుతారా? ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ వీడితే బీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు ఇష్టపడతారా లేదా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి. 


Related Post