ప్రజలకు నష్టం కలిగిస్తే కాంగ్రెస్‌ నష్టపోదా? సిఎం ప్రశ్న

March 14, 2026


img

సిఎం రేవంత్‌ రెడ్డి మూసీ ప్రాజెక్టుని ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు అనేక విమర్శలు, వివాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటన్నిటికీ నిన్న సమాధానం చెప్పారు. 

శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణాలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ లిమిటెడ్ అధ్వర్యంలో ‘మూసీ ఇన్‌వైట్స్’ నిర్వహించింది.

దానిలో దేశవ్యాప్తంగా పర్యాటక, ఆతిధ్య రంగాలలో ఉన్న కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, దాని రూపురేఖలు, ప్రయోజనాల గురించి వివరించారు. 

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు: 

1. నాడు బ్రిటిష్, నిజాం నవాబులు అప్పటి జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించారు. మరి మనం కూడా భవిష్యత్తులో పెరిగే జనాభా, అవసరాలకు తగ్గట్లు నగరాన్ని అభివృద్ధి చేయాలి కదా?  

2. పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ళు కూల్చివేసి వారికి నష్టం కలిగించాలని మేమెందుకు కోరుకుంటాము? వారికి ఇబ్బంది, నష్టం కలిగిస్తే మా పార్టీకి, ప్రభుత్వానికే నష్టం కలుగుతుంది కదా?

3. నాడు ఓఆర్ఆర్ నిర్మాణంలో పలువురు భూములు కోల్పోయారు. కానీ ఓఆర్ఆర్‌తో నగరం ఎంతగానో అభివృద్ధి చెందింది కదా? 

4. మూసీ ప్రాజెక్టులో నష్టపోయేవారికి ప్రభుత్వం పునరావాసం, నష్టపరిహారం చెల్లిస్తుంది. నగరాభివృద్ధి, భవిష్యత్‌ తరాల కోసం కొన్ని త్యాగాలు తప్పవు. 

5. ఏటా వరదలొస్తే మూసీ పొంగి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయం తెలిసి ఉన్నా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయలేదు. ఎందుకు?

6. మూసీ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రి తీసుకున్న తొందరపాటు నిర్ణయం కాదు. గత రెండేళ్ళుగా విదేశాలలో పర్యటించి ఇలాంటి ప్రాజెక్టులను పరిశీలించి, వాటి లాభనష్టాలన్నీ తెలుసుకుని, నిపుణులతో చర్చించిన తర్వాత దీనిని తీసుకున్నాము. 

7. నాడు రుషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అవరోదాలు సృష్టిస్తున్నట్లే, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజక్టుకి ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయి. నాడు రుషులు యజ్ఞాలు ఆపలేదు. నేడు మేము ఈ ప్రాజెక్టుని ఆపబోము. ఎన్ని అవరోధాలు ఎదురైనా తప్పకుండా పూర్తిచేస్తాము. 

8. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరం రూపురేఖలే మారిపోతాయి. హైదరాబాద్‌ పేరు దాంతో బాటు ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మించినందుకు మా పేరు మారుమ్రోగిపోతుంది. ఆ అసూయతోనే బీఆర్ఎస్‌ పార్టీ దీనిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోంది. 

9. మాకు అడ్డుపడి చెడ్డపేరు తెచ్చుకునే బదులు దీని అభివృద్ధిలో భాగస్వామి అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నా. ఈ ప్రాజెక్టులో ఏవైనా లోపాలుంటే వాటిని మా దృష్టికి తెస్తే సరిదిద్దుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు.

10. మూసీ, ఈసీ సంగమంలో గాంధీజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ ఘాట్ నిర్మించారు. కానీ దాని గురించి ఎంత మందికి తెలుసు? దానిని ఎంతమంది సందర్శిస్తున్నారు? అలాంటి చారిత్రిక నేపధ్యం ఉన్న ప్రదేశాన్ని గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మార్చాలనుకోవడం తప్పేలా అవుతుంది. 

11. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు. కానీ అభివృద్ధిలోనే రియల్ ఎస్టేట్ తప్పనిసరిగా ఉంటుంది. 


Related Post