ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బీఆర్ఎస్ పార్టీకి నేడు సుప్రీంకోర్టు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలతో ఏకీభవిస్తూ ఈ కేసు విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించి, చట్టబద్దంగా, పూర్తి పారదర్శకంగా విచారణ జరిపారని, వారిలో ఏ ఒక్కరూ పార్టీ మారలేదని, అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ధ్రువీకరించుకుని తీర్పు చెప్పారని అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకి తెలియజేశారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారనప్పుడు అనర్హత వేటు ప్రశ్నే ఉత్పన్నం కాదని వాదించారు. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టుకి సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విని అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈ కేసుని ఇంతటితో ముగిస్తున్నట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ప్రకటించారు.
ఇంతకాలం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడక తప్పదని, లేకున్నా వారిలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాలు, దాంతో ఉప ఎన్నికలు తప్పవని కేసీఆర్, కేటీఆర్ గట్టిగా నమ్మారు. కానీ సుప్రీంకోర్టు ఇంత సింపుల్‌గా కేసు ముగించేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో?