ఇదేం ట్విస్ట్... విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్

October 19, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా మాగంటి సునీత నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా ఆమెతో వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. 

ఒకవేళ ఏ కారణం చేతైనా ఎన్నికల సంఘం మాగంటి సునీత నామినేషన్ తిరస్కరించినట్లయితే బీఆర్ఎస్‌ పార్టీ పోటీలో లేకుండా పోతుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా నామినేషన్  వేయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

కానీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్‌కి మజ్లీస్ పార్టీతో సహా కొందరు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించడంతో, మాగంటి సునీత ఆయనతో పోటీ పడలేరని బీఆర్ఎస్‌ అధిష్టానం భావించి ఉండవచ్చు. దివంగత పీజేఆర్ కుమారుడుగా విష్ణువర్ధన్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు, పట్టు ఉంది. కనుక నవీన్ యాదవ్‌ని ఎదుర్కోవడానికి విష్ణువర్ధన్ రెడ్డి సరైన వ్యక్తి అని నామినేషన్  వేయించి ఉండవచ్చు. 

బీఆర్ఎస్‌ పార్టీ నిర్ణయం మాగంటి సునీతకు చాలా అవమానకరమే. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీఆర్ఎస్‌ పార్టీయే ఆమెను ఆహ్వానించి టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించింది. కానీ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా నామినేషన్  వేయించడంతో ఆమెను పక్కకు తప్పుకోమని చెప్పినట్లే భావించవచ్చు. దీనిపై ఆమె ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.


Related Post