నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్, ఫౌజీ పోస్టర్స్ విడుదల చేశారు. కానీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ నుంచి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు సందీప్ వంగ ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ అంటూ స్పిరిట్ సినిమా నుంచి చిన్న ఆడియో క్లిప్ విడుదల చేశారు.
దానిలో ఏదో నేరం కింద అరెస్ట్ అయిన ఐపిఎస్ ఆఫీసర్ ప్రభాస్‌ని రిమాండ్ మీద జైలుకి తీసుకువస్తారు. జైలు సూపరిండెంట్ ప్రకాష్ రాజ్ అతనికి గుడ్డలూడదీయించి మెడికల్ టెస్ట్ చేయించమని ఆదేశించడం , ఖైదీ యూనిఫారం తొడిగించమని ఆదేశిస్తారు. ఈ జైల్లో పోలీస్, ఖైదీలు మాత్రమే ఉంటారు. అప్పుడు ప్రభాస్ ‘మిస్టర్ సూపరిండెంట్... నాకు చిన్నప్పటి నుంచి ఓ చెడ్డ అలవాటుంది..” అనే డైలాగ్‌తో ఈ ఆడియో క్లిప్ ముగుస్తుంది.
ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారు. అదే విషయం ఆడియో క్లిప్‌లో ధ్రువీకరించారు దర్శకుడు సందీప్ వంగ. ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఆడియో క్లిప్‌తోనే చెప్పేశారు. అలాగే ఐపీఎస్ ఆఫీసరుగా పని చేస్తున్న ప్రభాస్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు రిమాండ్‌కి పంపారు?అని ఆలోచింపజేస్తుంది ఈ ఆడియో క్లిప్.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రీ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబిరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ; సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; కెమెరా: రాజ్ తోట; యాక్షన్: సుప్రీమ్ సుందర్; ఆర్ట్: ఘార్గి ముఖర్జీ చేస్తున్నారు.
గుల్షన్ కుమార్ & టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.