మాగంటి సునీతని నా తండ్రిని పెళ్ళి చేసుకోలేదు: ప్రద్యుమ్న

October 22, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్స్ వేసిన మాగంటి సునీతపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ పిర్యాదు వచ్చింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఆ పిర్యాదు చేశారు.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అయన ఈ మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. మాగంటి సునీతను తన తండ్రి వివాహం చేసుకోలేదని, ఆమెతో సహజీవనం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో తాను మాగంటి రవీంద్రనాథ్ భార్యనని తప్పుడు సమాచారం ఇచ్చారని కనుక ఆమె నామినేషన్ తిరస్కరించాలని ఆ లేఖలో కోరారు. 

ఎన్నికల అధికారులు నేడు అభ్యర్ధుల నామినేషన్స్ పరిశీలిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిపై ఇటువంటి పిర్యాదు రావడంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇది వారి కుటుంబ వ్యవహారం కనుక ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరించాల్సిన అవసరం లేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. 

బహుశః ఇందుకే బీఆర్ఎస్‌ పార్టీ ముందు జాగ్రత్త పడుతూ విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా అభ్యర్ధిగా నామినేషన్ వేయించినట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ఎన్నికల సంఘం ఆమె నామినేషన్ అంగీకరిస్తే విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో నుంచి తప్పుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆమెకు బదులు ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు మరికొద్ది సేపటిలో నామినేషన్స్ అంగీకరించిన అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.


Related Post