జూబ్లీహిల్స్‌లో మరో ఇద్దరి మద్య ఫైట్!

October 18, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు, వాటి అభ్యర్ధుల మద్య పోరు సాగుతోంది. ఇది చాలా సహజం. అయితే దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన్ రెడ్డి కూతురు విజయ రెడ్డి, కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీల కొరకు కత్తులు దూసుకుకోవడం చూసి నియోజకవర్గంలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పి.జనార్ధన్ రెడ్డి రాజకీయ వారసులుగా వారిద్దరికీ ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. 

మొదట్లో ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండేవారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి 2023 ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన సోదరి విజయా రెడ్డి 2022లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి నేటికీ దానిలోనే కొనసాగుతున్నారు. ఈవిదంగా అక్కా తమ్ముడు ఇద్దరూ చెరో పార్టీలో ఉండటం, పీజేఆర్ రాజకీయ వారసులుగా ఇద్దరికీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మంచి పేరు, పలుకుబడి ఉండటంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు వారిద్దరిని ఎన్నికల ప్రచారంలో దింపాయి. 

కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ తరపు విజయా రెడ్డి, బీఆర్ఎస్‌ అభ్యర్ధి మాగంటి సునీత తరపున విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అక్కా తమ్ముడూ ఇద్దరూ చెరో పార్టీకి పని చేస్తుండటంతో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. 

రెండు పార్టీలకు గల అనుకూల ప్రతికూల అంశాలు ఎలాగూ ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ అక్కా తమ్ముడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రభావితం చేయగలరనేది కూడా కీలకంగా మారింది. నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరుగుతాయి. నవంబర్‌ 14న ఫలితాలు వెలువడతాయి. 


Related Post