కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో ఇటీవల హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలంగాణ పోలీస్ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత, ముగ్గురు కుమారులకు ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున సంతాపం తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ డీజీపీ శివధర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జీవో నం: 411 జారీ చేసింది. ఇదిగాక కానిస్టేబుల్ ప్రమోద్ మిగిలిన సర్వీసు కాలానికి చివరి రోజు వరకు జీతం చెల్లిస్తుంది. ఇవిగాక పోలీస్ ప్రొటక్షన్ ఫండ్స్ నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి మరో రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా కలిపి ప్రమోద్ కుటుంబానికి అందిస్తుంది. ప్రమోద్ కుటుంబానికి 300 చ.గజాల ఇంటి స్థలం,అయన కుమారులలో ఒకరికి ప్రభుత్వోద్యోగం కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.