కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు ఓ సంచలన ప్రకటన చేశారు. “తెలంగాణ రాజకీయ నాయకులకు ఇదే చివరి హెచ్చరిక! రాజకీయాలలో కొనసాగుతూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న నాయకులలో కొందరికి ఆయుధ పోరాటాలు చేసే వారితో రహస్య సంబంధాలున్నాయి. అటువంటివారు తక్షణం వారితో సంబంధాలు తెంచేసుకోండి. లేకుంటే మావోయిస్టుల తర్వాత రేపు మీ వంతు వస్తుంది.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం మేరకు నిఘా సంస్థలు ఉగ్రవాదులతో సంబంధాలున్న నాయకుల జాబితా సిద్దం చేస్తున్నాయి. కనుక మావోయిస్టుల ఏరివేతతోనే ఈ కార్యక్రమం ముగిసిపోదు. తీవ్రవాదులు, మావోయిస్టులు, అవినీతిపరులు, నేరాలకు పాల్పడేవారినీ, వారితో సంబంధాలున్న ప్రతీ ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం ఏరి పారేయబోతోంది.
తెలంగాణలో అటువంటి రాజకీయ నాయకులకు ఇదే చివరి హెచ్చరికగా పరిగణిస్తే వారికే మంచిది. ఆ తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు,” అని బండి సంజయ్ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తున్నప్పుడు, దానిని అడ్డుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కనుకనే మావోయిస్టులు ప్రాణ భయంతో పోలీసులకు లొంగిపోతున్నారు.
‘ఆపరేషన్ కగార్’ విజయవంతం అవుతోంది కనుక అది ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అటువంటి మరో ఆపరేషన్ చేపట్టబోతోందని భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నదే మంత్రి బండి సంజయ్ చెప్పారనుకోవచ్చు.