హైదరాబాద్‌ మెట్రో: కమిటీ ఏర్పాటు

October 18, 2025
img

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్ నిర్మించి ఇంతకాలంగా నిర్వహిస్తున్న ఎల్&టి కంపెనీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకోబోతోంది.

కానీ ఎల్&టి వంటి ఎంతో నేర్పు, అనుభవం ఉన్న కంపెనీ హైదరాబాద్‌ మెట్రోని నడిపించలేక నష్టాలపాలై ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభుత్వం దానిని చేపట్టి విజయవంతంగా నడిపించగలదా?మళ్ళీ లాభాల బాట పట్టించగలదా?

ముఖ్యంగా ఇప్పుడు ప్రతీ చిన్న అంశంపై రాజకీయాలు, కుట్రలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రోని నడిపించగలదా?లేకపోతే ప్రత్యామ్నాయాలు ఏమిటి?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై లోతుగా చర్చించారు. ముందుగా దీనిపై ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసి హైదరాబాద్‌ మెట్రోకి సంబంధించిన ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. 

మెట్రోని ప్రభుత్వం చేపడితే ఎదురయ్యే సాధక బాధకాలు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళ గురించి ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఎల్&టి కంపెనీ నుంచి హైదరాబాద్‌ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ ప్రక్రియకు అవసరమైన ఆర్ధిక, సాంకేతిక, చట్టపరమైన చర్యల గురించి ఈ అధికారుల కమిటీ అధ్యయనం చేస్తుంది.    

ఒకవేళ మెట్రోని ప్రభుత్వం చేపట్టలేని పరిస్థితి నెలకొని ఉంటే, దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయాలున్నాయి? అనే అంశంపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.

ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఆయన నేతృత్వంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, మెట్రో రైల్ ఎండీ సభ్యులుగా ఉంటారు. 

ఈ అధికారుల కమిటీ అన్ని అంశాలపై అధ్యయనం మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక ఇస్తుంది. అది దీనిపై చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగు సిఫార్సులు చేస్తుంది. వాటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తారు.                    


Related Post