తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్ నెలాఖరులోగా పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గుండా పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు ఆ పాదయాత్ర పోస్టర్ విడుదల చేయబోతున్నారు. దానిలో కేసీఆర్ ఫోటోకి బదులు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో ఉంటుందని సమాచారం.
సామాజిక తెలంగాణ సాధన కోసం ఆమె పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. నేడు పాదయాత్ర పోస్టర్ విడుదల చేసినప్పుడు ఆమె స్వయంగా వివరిస్తారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యేక గుర్తింపు, గౌరవ మర్యాదలు అందుకున్న కల్వకుంట్ల కవితకి పార్టీ నుంచి నుంచి బహిష్కరించబడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో పలువురు తనతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పినప్పటికీ ఇంత వరకు ఏ ఒక్క సీనియర్ నాయకుడు ఆమెతో చేతులు కలిపేందుకు ముందు రాలేదు.
ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారు కనుక సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించుకోవడమో లేదా ఏదో ఓ పార్టీలో చేరితే అర్ధవంతంగా ఉండేది. కానీ ఆమె తెలంగాణ జాగృతితో ముందుకు సాగుతుండటంతో, ఆమెతో చేతులు కలిపినా తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రాజకీయ నాయకులు, ఆమె రాజకీయ ఉద్దేశ్యం ఏమిటో తెలియక ప్రజలు పట్టించుకోరు. కనుక ఆమె ముందుగా తన రాజకీయ ఉద్దేశ్యం, లక్ష్యం గురించి వివరించడం చాలా అవసరం.