నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రైతులు ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. ఓఆర్‌ఆర్ భూసేకరణలో నష్టపోబోతున్న గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నామినేషన్స్ వేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే వంద మందికి పైగా నామినేషన్స్ వేసేందుకు సిద్దం కాగా ఇంకా మరో 100-200 మంది వరకు నామినేషన్స్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓఆర్‌ఆర్ వలన తమ జీవనోపాధినిచ్చే వ్యవసాయ భూములను కోల్పోతే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని కనుక ఓఆర్‌ఆర్‌ని తమ గ్రామాలకు 60 కిమీ అవతల ఉండేలా ఎలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్స్ వేసి నిరసనలు తెలుపాలనుకున్నారు. కానీ అవి వాయిదా పడటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నామినేషన్స్ వేసేందుకు సిద్దం అవుతున్నారు.
గత ప్రభుత్వ హయంలో యాదాద్రి అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు పలువురు రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ కోసం తమ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని రైతులు అంటున్నారు. తమ నిరసన తెలియజేసేందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నామినేషన్స్ వేయబోతున్నట్లు చెప్పారు.
నాడు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా లోక్‌సభ ఎన్నికలలో సుమారు 150 మంది పసుపు రైతులు నామినేషన్స్ వేశారు. ఆ కారణంగానే సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రైతులు నామినేషన్స్ వేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై ఘాటుగానే స్పందించవచ్చు.
ఈ భూసేకరణ వ్యవహారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కనుక దీనిపై అయన ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.