మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు సరికొత్త ఆంక్షలు విధించారు. తన నియోజకవర్గంలో మద్యం దుకాణాల లైసెన్సులు లభించి మద్యం వ్యాపారాలు చేసుకోబోయే వారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అమ్ముకోవాలని సూచించారు.
మద్యం దుకాణాలు ఊర్లో అనుమతించబోమని ఊరి బయటే పెట్టుకోవాలని సూచించారు. మద్యం దుకాణాలలో ‘సిటింగ్స్’ అనుమతించబోమని చెప్పారు. మద్యం దుకాణాలకు లైసెన్సులు పొందినవారు సిండికేట్‌గా మారినా, బెల్ట్ షాపులకు మద్య విక్రయించినా సహించబోనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ షరతులు ఎవరినీ (మద్యం దుకాణ యజమానులను లేదా ప్రభుత్వాన్ని) ఇబ్బంది పెట్టేందుకు కావని, తన నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా యువతని మద్యానికి బానిసలు కాకుండా కాపాడుకోవడానికేనని చెప్పారు. కనుక నియోజకవర్గం ప్రజలు కూడా తన ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన అనుచరులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఓ వినతిపత్రం ఇచ్చారు.