రాజస్థాన్‌ బస్సులో మంటలు... 10 మంది మృతి!

October 14, 2025
img

రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు జైసల్మీర్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జోద్‌పూర్ బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాయత్ అనే గ్రామానికి సమీపంలో హైవేపై వెళుతుండగా బస్సు వెనుక భాగంలో మంటలు మొదలయ్యాయి. 

ప్రయాణికులు భయంతో కేకలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేశాడు. కానీ క్షణాలలో మంటలు బస్సంతా వ్యాపించాయి. కొంతమంది బస్సులో నుంచి బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ చివరి వరుసలో ఉన్న 10 మంది మంటలకు ఆహుతి అయిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వైద్య సహాయ సిబ్బంది, అంబులెన్సులలో అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు కానీ అప్పటికే బస్సు సగానికి పైగా దగ్ధమైపోయింది. గాయపడిన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో తరచూ ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా మంటలు ఆర్పివేసేందుకు ఆటోమేటిక్ వ్యవస్థని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. 

సినిమా థియేటర్లలో, షాపింగ్ మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్ తదితర బహిరంగ ప్రదేశాలలో ఆటోమేటిక్ స్మోక్, ఫెయిర్ డిటెక్టర్స్, మంటలు ఆర్పే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోగలిగినప్పుడు, బస్సులలో ఎందుకు ఏర్పాటు చేసుకోలేరు? కనీసం పొగ, ఉష్ణోగ్రతలో తేడాలు పసిగట్టి బస్సులో అలారం మ్రోగించే వ్యవస్థ లేదా బస్సుని వెంటనే నిలిపివేసే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. 

కానీ ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే బస్సులు నడిపిస్తూ, ప్రజల ప్రాణాలతో ఈవిదంగా చెలగాటం ఆడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు. వాటిలో ఇటువంటి ఏర్పాట్లు చేసుకునేలా చూడాల్సిన సంబంధిత శాఖల అధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. 

Related Post