పొన్నం తర్వాత వివేక్‌తో అడ్లూరి పేచీ!

October 12, 2025


img

నాలుగైదు రోజుల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మద్య వివాదం మొదలైతే కాంగ్రెస్‌ పెద్దలు పొన్నం ప్రభాకర్‌ చేత ఆయనకు క్షమాపణలు చెప్పించి ఆ వివాదానికి తెర దించారు. కానీ అది ముగియగానే ఇప్పుడు మరో మంత్రి జి వివేక్‌తో వివాదం మొదలైంది. 

మంత్రి వివేక్ ఈరోజు నిజామాబాద్‌ మాలల ఐక్య సదస్సులో మాట్లాడుతూ, “అడ్లూరి నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలీదు కానీ అయనను రాజకీయంగా ప్రోత్సహించింది మా నాన్న వెంకటస్వామి గారనే విషయం ఆయన మరిచిపోతున్నారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని అందరూ కలిసి గెలిపించుకోవాల్సి ఉండగా, నవీన్ యాదవ్‌ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుందని అసూయ చెందుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాకు కాంగ్రెస్‌ పార్టీయే ముఖ్యం తప్ప ఈ పదవులు కావు. ఆయన వస్తే నేను లేచి వెళ్ళిపోతున్నానని ఆయనకు ఎవరు చెప్పారో తెలీదు కానీ అది వాస్తవం కాదు. 

అడ్లూరితో నాకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఆయనకు నాతో ఉన్నట్లయితే ఆ విషయం నేరుగా నాకే చెప్పవచ్చు, పరోక్షంలో నా గురించి మాట్లాడటం అవసరమా?” అని అన్నారు. 

మంత్రి వివేక్ మాటలపై అడ్లూరి ఇంకా స్పందించాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారం ఇలాగే సాగితే మళ్ళీ కాంగ్రెస్‌ పెద్దలు కలుగజేసుకోక తప్పదు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ముందు సీనియర్ కాంగ్రెస్‌ నేతలందరూ కలిసి కట్టుగా పనిచేసి తమ అభ్యర్ధిని గెలిపించుకోవడంపై దృష్టి పెట్టకుండా, ఈవిదంగా కీచులాడుకుంటూ ప్రత్యర్ధి పార్టీలకు చేజేతులా అవకాశం కల్పిస్తుండటం సరికాదనే చెప్పాలి.     


Related Post