హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఇసుక వేస్తే రాలనంత మంది ప్రయాణిస్తుంటారు. అన్ని మార్గాలలో కలిపి రోజుకు సుమారు 4.50 లక్షల మంది పైనే ప్రయాణిస్తారని మెట్రో అధికారులు స్వయంగా చెపుతుంటారు. నగరం నలుమూలాల హైదరాబాద్ మెట్రోకి షాపింగ్ మాల్స్, వేలకోట్లు ఖరీదు చేసే విలువైన భూములున్నాయి.
ఇంతమంది ప్రయాణికులు, ఇంత ఆదాయం ఉన్నప్పటికీ హైదరాబాద్ మెట్రో నష్టాల ఊబిలో కూరుకుపోయి నడపలేక చేతులెత్తేసింది.
కనుక తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వమే మెట్రోని తీసుకోవలసివస్తోంది. ఇటీవలే ఈ మేరకు ఎల్&టి కంపెనీకి, ప్రభుత్వానికి మద్య సూత్రా ప్రాయంగా ఒప్పందం కూడా జరిగింది.
హైదరాబాద్ మెట్రో పరిస్థితి చూసిన తర్వాత ఏ రాష్ట్రమూ మెట్రో నిర్మాణానికి సిద్దపడదు. కానీ పొరుగు రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం విజయవాడ, విశాఖ నగరాలలో మెట్రో ఏర్పాటుకి సన్నాహాలు చేస్తోంది.
ముందుగా రూ.11,009 కోట్ల అంచనా వ్యయంతో మొదటి దశలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, అక్కడి నుంచి పెనమలూరు వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల గడువుని అక్టోబర్ 24 వరకు పొడిగించింది.
హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ జనాభా తక్కువ. పరిశ్రమలు, ఐటి కంపెనీలు కూడా చాలా తక్కువే. కానీ అమరావతి నిర్మాణం పూర్తయితే ఉద్యోగాలు, జనాభా భారీగా పెరుగుతారనే అంచనాతో విజయవాడలో మెట్రో నిర్మాణానికి పూనుకుంటోంది ఏపీ ప్రభుత్వం.
కానీ హైదరాబాద్ మెట్రోయే నష్టాల ఊబిలో కూరుకుపోయి ఎల్&టి కంపెనీ దానిని ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోతున్నప్పుడు, విజయవాడలో మెట్రో ఏవిదంగా నడుస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోందో తెలీదు.
అసలు మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ అన్నీ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయని కనుక అటువంటి ఆలోచన చేయవద్దని మెట్రో గురూ శ్రీధరన్ ఎప్పుడో చెప్పారు కూడా. కానీ ఏపీ ప్రభుత్వం ముందుకే సాగుతోంది.