జూబ్లీహిల్స్‌: బీజేపి అభ్యర్ధి విక్రం గౌడ్‌?

October 14, 2025


img

నవంబర్‌ 11న జరుగబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు అప్పుడే నామినేషన్స్ కార్యక్రమం కూడా మొదలైపోయింది. ముందుగా బీఆర్ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధిగా దివంగత మాగంటి రవీంద్రనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ప్రకటించి అప్పుడే జోరుగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తోంది.

అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా నవీన్ యాదవ్‌ని అభ్యర్ధిగా ప్రకటించడంతో అయన కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

కానీ బీజేపి మాత్రం ఇంకా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. దీని కోసమే బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఢిల్లీలో తమ అధిష్టానంతో చర్చిస్తున్నారు. సోమవారం రాత్రి దీపక్ రెడ్డి లేదా కీర్తి రెడ్డిలలో ఎవరో ఒకరి పేరు ప్రకటించవచ్చని అందరూ భావించారు.

కానీ అనూహ్యంగా మరో కొత్త పేరు ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ కుమారుడు విక్రం గౌడ్‌. ఆయన గతంలో బీజేపిలోనే ఉండేవారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అయన టికెట్ ఇస్తే మళ్ళీ బీజేపిలో చేరి పోటీకి సిద్దమని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ ఉప ఎన్నికలలో మాగంటి సునీతని అభ్యర్ధిగా బరిలో దించి బీఆర్ఎస్‌ పార్టీ సానుభూతి ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు పొందాలనుకుంటోంది.

కాంగ్రెస్‌ పార్టీ నవీన్ యాదవ్‌ని బరిలో దించి నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు పొందాలనుకుంటోంది.

కనుక ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్‌ (బీసీ)ని బరిలో దించితే పార్టీకి లాభిస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః ఈరోజు బీజేపి అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం ఉంది.  

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల షెడ్యూల్

నామినేషన్ గడువు: అక్టోబర్‌ 20, ఉపసంహరణ: అక్టోబర్‌ 23, పోలింగ్: నవంబర్‌ 11, ఓట్ల లెక్కింపు, ఫలితాలు: నవంబర్‌ 14.       



Related Post