నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నవీన్ యాదవ్, మాగంటి సునీతలను అభ్యర్ధులుగా బరిలో దించాయి. రెండు పార్టీలకు ఈ ఉప ఎన్నికలో గెలిపు చాలా అవసరం.
బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన ఈ సీటుని తిరిగి దక్కించుకోకపోతే, కాంగ్రెస్ పాలన గురించి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనలను ప్రజలు నమ్మడం లేదని భావించాల్సి వస్తుంది. ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుస ఓటములు చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో కూడా ఓడిపోతే తీరని అప్రదిష్ట.
ఈ ప్రభావం త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నమ్మకం తగ్గవచ్చు. కనుక ఈ ఉప ఎన్నికలలో సునీత గెలుపు బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యం.
ఈ ఉప ఎన్నికలో ఓడినా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం, ప్రభావం ఉండవు. కానీ గెలిస్తే మాత్రం ఇది పెద్ద ఉపశమనమే అవుతుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మీడియాతో మాట్లాడుతూ, “సానుభూతి ఓట్లతో గెలవాలనే సునీతని బరిలో దించినప్పటికీ, బహిరంగ వేదికలపై ఆమె కన్నీళ్ళు కార్చినా ప్రయోజనం ఉండదు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోబోతోంది,” అని అన్నారు.