ఏపీ ప్రభుత్వం పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానం కొరకు సమగ్ర నివేదిక రూపొందించేందుకు టెండర్లుపిలిచింది. దీంతో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు మొదలయ్యాయి.
కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుతో ముందుకు సాగుతుంటే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తూ ఏపీ ప్రాజెక్టులకు సహకరిస్తోందని విమర్శించారు.
ఓ పక్క ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గోదావరి, కృష్ణా నీళ్ళను తమ తమ రాష్ట్రాలకు మళ్ళించుకుంటుంటే, మరోపక్క దిగువన ఉన్న ఏపీ కూడా అందినకాడికి నీళ్ళు తరలించుకుపోతోందన్నారు. ఈవిదంగా కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఉన్న రాష్ట్రాలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంటే, సిఎం ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని హరీష్ రావు విమర్శించారు.
ఆయన విమర్శలపై తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే హరీష్ రావు నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టుని తమ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌ని కలిసి దీనిపై అభ్యంతరం తెలిపి లిఖిత పూర్వకంగా వినతిపత్రం కూడా ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ తమకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కనుక ఆల్మటి ఎత్తు పెంపుపై కర్ణాటక ప్రభుత్వానికి కూడా అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. నీళ్ళ విషయంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, దానిని తమ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దేందుకు గట్టిగా కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.