ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెనక్కు వెళ్ళిపోయిన తర్వాత తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకొని పాలిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి తీవ్రవాదులు నడుపుతున్న ప్రభుత్వాన్ని గుర్తించాలో వద్దో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇంతకాలం భారత్ కూడా దూరంగానే ఉన్నప్పటికీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌తో ప్రమాదం పొంచి ఉంది కనుక తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహానికి సిద్దపడినట్లుంది.
భారత్ ఆహ్వానం మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ నేడు ఢిల్లీకి వచ్చారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్‌కు 5 అంబులెన్సులు బహుమతిగా అందించారు.
అసలు తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహం చేయడమే విచిత్రమనుకుంటే, జైశంకర్ ఆయనతో కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన ఆ మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులు ఎవరినీ ఆహ్వానించకపోవడంతో తాలిబాన్ బుద్ది చూపించుకున్నారని విమర్శించారు.
దీనిపై జైశంకర్ స్పందిస్తూ, ఈ మీడియా సమావేశం ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయంలో జరిగింది. అక్కడ భారత్‌కు ఎటువంటి అధికారం ఉండదు. కనుక ఈ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు,” అని చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి స్పందిస్తూ, “మాకు మహిళల పట్ల ఎటువంటి వివక్ష లేదు. మీడియా సమావేశానికి పరిమిత సంఖ్యలో పాసులు జారీ చేయడం వల్లనే వారికి ఆహ్వానం అందలేదు. ఇది కేవలం సాంకేతిక సమస్య. అంతే,” అని అన్నారు.