కేసీఆర్‌కి మంచి రోజులు.. అయిపోయాయి: రేవంత్ రెడ్డి

December 07, 2025


img

ఇటీవల కేసీఆర్‌, “బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరికీ మంచి రోజులు వస్తాయి,” అని అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై సిఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. 

“పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు సర్పంచ్‌లను పక్కన పెట్టుకొని, బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్‌ ఒకప్పుడు బాగానే జీవించారు. వెయ్యి కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి 10 ఎకరాలలో తన కోసం గడీ నిర్మించుకున్నారు. 

కానీ మాజీ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్‌ వంటి సీనియర్లను లోనికి రానీయకుండా అవమానించి గేటు వద్ద నుంచే తిప్పి పంపినప్పుడే ఆయన పతనం ప్రారంభం అయ్యింది. 

ఇప్పుడు ఆయన కుర్చీ కోసం కొడుకు, కూతురు, మేనల్లుడు కీచులాడుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు మా పాలనపై రిఫరెండం అని కేటీఆర్‌ చెపితే, ప్రజలు బొరబండపై బీఆర్ఎస్‌ పార్టీని ఉతికి ఆరేశారు. బీఆర్ఎస్‌ పార్టీకి కేటీఆరే పెద్ద గుదిబండ. అయినా కేసీఆర్‌ మంచి రోజులు వస్తాయని ఆశపడుతున్నారు పాపం. 

అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు. అయినా ఇంకా మీ కడుపు నిండ లేదా? మీ ఆశకు హద్దు లేదా? ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక తెలంగాణలో ఏమీ మిగలదు. కానీ ప్రజలు మీకు ఆవకాశం ఇక ఎన్నడూ ఇవ్వరు.

మీరు... మీ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు అవినీతి, అక్రమాలకూ పాల్పడ్డారు. ప్రజాధనంతో గడీలు, ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు. కానీ మా ప్రభుత్వం రూ.22,000 కోట్లు ఖర్చు చేసి ప్రతీ నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకు ఇస్తోంది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రావు. రైతు బంధు ఉండదని బీఆర్ఎస్‌ పార్టీ దుష్ప్రచారం చేసింది. కానీ రెండేళ్లుగా అన్నీ ఇస్తూనే ఉన్నాము కదా? ఇక ముందు కూడా ఇస్తాము. మరో పదేళ్ళు మేమే అధికారంలో ఉంటాము. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలను గమనిస్తూ ప్రజా పాలన చేస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.


Related Post