హైదరాబాద్ నగరంలో మరో భారీ అంతర్జాతీయ సదస్సుకి వేదిక కాబోతోంది. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ జరుగబోతోంది. ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన వందలాది మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు.
కనుక సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిన్న ఏరియల్ సర్వే చేసి సదస్సు జరుగుతున్న ప్రదేశం చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం సదస్సు ప్రాంగణం చేరుకొని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు.
ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన వీఐపీలు వస్తున్నందున తెలంగాణ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రాంగణం వద్ద సువిశాలమైన పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి కోసం ముందు జాగ్రత్తగా వైద్య, అగ్నిమాపక, విద్యుత్ సిబ్బందిని అవసరమైన యంత్రాలు, పరికరాలతో సిద్ధంగా ఉంచారు. సదస్సు జరిగే రెండు రోజులు విద్యుత్, ఇంటర్నెట్ అంతరాయాలు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి కనీసం రూ.50-75వేల కోట్లు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఈ సదస్సులో ప్రత్యేకంగా తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిలో మంత్రులు, ఐటి, పరిశ్రమలు తదితర సంబందిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యి దేశవిదేశీ ప్రతినిధులకు తెలంగాణ, హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు స్థాపనకు అనుకూలమైన ప్రదేశాలను, వాటి ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో ఈ రెండు రోజుల సదస్సు ప్రారంభం అవుతుంది.