ఇండిగో సమస్యతో ఆర్టీసీ, రైల్వేకి అదనపు ఆదాయం

December 06, 2025
img

ఇండిగో విమానాలు వరుసగా 5వ రోజు కూడా రద్దు అయ్యాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా మిగిలిన విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను అవి పట్టించుకోవడం లేదు.

ఇండిగో సమస్యని టీజీఎస్ ఆర్టీసీ బాగానే గుర్తించింది. వెంటనే హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబాయి, విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర నగరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి నడిపించడం మొదలుపెట్టింది. వీటిలో స్లీపర్ బస్సులు కూడా ఉన్నాయి. అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచే నేరుగా ఆయా ప్రాంతాలకు బయలుదేరుతుండటంతో విమాన టికెట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు మరో ఆలోచన చేయకుండా టీజీఎస్ ఆర్టీసీ బస్సుఅలలో బయలుదేరిపోతున్నారు.

 ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నాయి. ఇండిగో సమస్యని భారతీయ రైల్వే కూడా వినియోగించుకుంటోంది. సికింద్రాబాద్‌తో సహా పలు ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్ళు నడిపిస్తోంది. 

పౌరవిమానయాన శాఖా మంత్రి రామోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇండిగో సంస్థ ఈ సమస్యపై తప్పనిసరిగా కేంద్రానికి వివరణ ఇవ్వాలి. సంస్థ వలన వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఆదివారం రాత్రి 8 గంటలలోగా టికెట్ డబ్బు వాపసు చేయాలి,” అని అన్నారు. 

Related Post