భారత్ మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్ళి రద్దు చేసుకున్నారు. ఈ విషయం వారిరువురూ వేర్వేరుగా తమ సోషల్ మీడియా ఖాతాలలో ధృవీకరించారు.
నవంబర్ 23న వారి వివాహం జరుగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు వాయిదా పడింది. ఆ తర్వాత వారి పెళ్ళి రద్దు అయిందని ఊహాగానాలు రాగా, వారిరువురూ కలిసి దిగిన తాజా ఫోటో ఒకటి పోస్ట్ చేసి తమ జంటకు దిష్టి పెట్టవద్దన్నట్లు దిష్టి ఇమోజీ కూడా పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలు త్వరలో వారి పెళ్ళి జరుగుతుందని మీడియాకు తెలియజేశారు.
కానీ నేడు వారిద్దరూ తమతమ సోషల్ మీడియా ఖాతాలలో అనివార్య కారణాల వలన తమ పెళ్ళి పూర్తిగా రద్దు చేసుకున్నట్లు వేర్వేరుగా పోస్టులు పెట్టి, తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
స్మృతి మంధాన ఏమన్నారంటే, గత కొన్ని వారాలుగా నా జీవితంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కనుక నేను స్పందించడం అవసరమని భావించి ఈ విషయం చెపుతున్నాను. నా వివాహం రద్దు అయ్యింది.
ఇక్కడితో ఈ విషయంపై చర్చ ముగించి మా ప్రైవసీని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. భారత్ తరపున మరిన్ని మ్యాచ్‌లు ఆడి మరిన్ని ట్రోఫీలు సాధిస్తా. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇక ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది,” అని ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పెట్టారు.