రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

December 07, 2025


img

సిఎం రేవంత్ రెడ్డి పదేపదే లక్షకోట్లు పెట్టి కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శిస్తుండటంతో మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్ళ సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “మాది రైతు ప్రభుత్వం అని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పదేపదే చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఒక్క మండలంలోనే 450 మంది రైతులకు రెండు నెలలుగా రూ.45 కోట్లు బకాయిలు చెల్లించలేదు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రేపు ఎల్లుండి అంటూ మాటలు చెపుతున్నారు కానీ బకాయిలు చెల్లించడం లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేకుంటే వారు యాసంగి పంట కోసం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది,” అని అన్నారు. 

సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఆయనకు దమ్ముంటే ఓ సారి సిద్ధిపేటకు రావాలి. వస్తే ఆయన మెడకు బండ కట్టి రంగానాయక్ సాగర్‌లో పడేస్తాను. ఒకవేళ మునిగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు యధాతధంగా ఉన్నట్లు ఆయన ఒప్పుకోవాలి. లేకుంటే కూలిపోయిందని నేను ఒప్పుకుంటాను. మమ్మల్ని బండకేసి కొట్టడం కాదు... హామీలు అమలు చేయకుండా, బకాయిలు చెల్లించకుండా అబద్దాలు, మాయమాటలు చెపుతుంటే ప్రజలే మిమ్మల్ని బండకేసి కొడతారు,” అని హరీష్ రావు అన్నారు.


Related Post