పాల్వంచలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌!

December 06, 2025


img

ప్రముఖ కన్నడ నటుడు డా.శివరాజ్ కుమార్‌ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచకు వచ్చారు. సీపీఐ-ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గుమ్మడి నర్సయ్య జీవితగాధ ఆధారంగా ఆయన పేరుతోనే సినిమా తీస్తున్నారు. 

ఈ సినిమాలో డా.శివరాజ్ కుమార్‌ గుమ్మడి నర్సయ్యగా నటిస్తున్నారు. నేడు పాల్వంచలో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అయన వచ్చినప్పుడు మాట్లాడుతూ, “ఈ సినిమా ఎందుకు చేస్తున్నానంటే, మన కోసం మనం బ్రతకడం కాదు ఇతరుల కోసం బ్రతకాలని కోరుకునే గొప్ప వ్యక్తి గుమ్మడి నర్సయ్యగారు. 

అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేటి తరానికి ముఖ్యంగా... రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్న యువతకి గుమ్మడి నర్సయ్య గారి జీవితం గురించి తెలియజేయాలనే నేను ఈ సినిమాలో నటిస్తున్నాను.

గుమ్మడి నర్సయ్య గారిని చూసినప్పుడు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఒకప్పుడు మా నాన్నగారు కూడా అయన లాగే చాలా నిరాడంబర జీవితంగా గడిపేవారు. ఆయనలాగే ఆలోచించేవారు. కనుక గుమ్మడి నర్సయ్య గారిని చూసినప్పుడు నా తండ్రిని మళ్ళీ చూస్తున్నట్లే అనిపించింది. నేను వారి ఇంటికి కూడా వెళ్ళాను. వారిని చూస్తున్నప్పుడు వారు నా కుటుంబ సభ్యులే అనిపించింది. 

ఇది నేను ఆయన లేదా ఎవరి మెప్పు కోసమో చెప్పడం లేదు. ఆయనని చూసినప్పుడు నా మనసులో కలిగిన భావన ఇది. అదే చెప్తున్నాను. నాకు తెలుగు మాట్లాడటం రాదు. కానీ ఈ సినిమా కోసం నేర్చుకొని నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను,” అని అన్నారు. 

ఈ సినిమా పూజా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. 

ఈ సినిమాని ప్రవళిక ఆర్ట్స్ బ్యానర్‌పై పరమేశ్వరన్ దర్శకత్వంలో నల్లా సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష