జూబ్లీహిల్స్‌: బీజేపి అభ్యర్ధి దీపక్ రెడ్డి

October 15, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు బీజేపి కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసింది. దీపక్ రెడ్డి 2023 ఎన్నికలలో పోటీచేసి బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధి మాగంటి రవీంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి హైదరాబాద్‌ సెంట్రల్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. 

బీజేపి కూడా అభ్యర్ధిని ఖరారు చేయడంతో ఉప ఎన్నికళ యుద్ధానికి మూడు పార్టీలు సిద్దమైనట్లే. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌, బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ సతీమణి మాగంటి సునీత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో దిగుతున్న నవీన్ యాదవ్‌ కూడా 2014 (మజ్లీస్), 2018లో స్వతంత్ర అభ్యర్ధిగా రెండుసార్లు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

కాంగ్రెస్‌, బీజేపి రెండు పార్టీలలో పలువురు టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ నవీన్ యాదవ్‌, దీపక్ రెడ్డి దక్కించుకున్నారు. కనుక ఈ ఉప ఎన్నికలలో గెలవలేకపోతే మరోసారి వారికి అవకాశం లభించకపోవచ్చు. 

ఈ ఉప ఎన్నికలో మాగంటి సునీతని గెలిపించుకోలేకపోతే బీఆర్ఎస్‌ పార్టీ ఇంకా కోలుకోలేదని స్పష్టమవుతుంది. పార్టీలో నేతలు కేటీఆర్‌ నాయకత్వాన్ని ప్రశ్నించవచ్చు. మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నికలు చాలా కీలకమే కనుక పోరు భీకరంగా సాగబోతోంది.   

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు పోలింగ్: నవంబర్‌ 11న, ఓట్ల లెక్కింపు ఫలితాలు: నవంబర్‌ 14న. 


Related Post