ఎన్నికలలో గెలిచేందుకే ఈ నిర్ణయం: ప్రశాంత్ కిషోర్‌

October 15, 2025


img

ప్రశాంత్ కిషోర్‌... కాంగ్రెస్‌, బీజేపి వంటి జాతీయ పార్టీలతో సహా దేశంలో అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పనిచేసి గెలిపించిన కింగ్ మేకర్. అలాంటి వ్యక్తి  తన సొంత రాష్ట్రం బీహార్‌లో తన సొంత పార్టీ ‘జన్ సూరజ్’ని గెలిపించుకోలేరా? అంటే అవుననే అంటున్నాయి బీజేపి-జేడీయు కూటమి, కాంగ్రెస్‌- ఆర్‌జేడీ కూటమి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇలాంటి కీలక సమయంలో ప్రశాంత్ కిషోర్‌ తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటన చేయడంతో వాటి వాదనలకు బలం చేకూర్చినట్లయింది. 

కానీ తాను ఎన్నికలలో పోటీ చేస్తే పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి పూర్తి సమయం కేటాయించలేనని అందుకే ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ ఘోరపరాజయం తప్పదన్నారు.

తమ పార్టీకి కనీసం 150 వస్తాయని, ఒక్క సీటు తగ్గినా తాను ఓడిపోయినట్లే భావిస్తానన్నారు. ఈసారి మేమే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ప్రశాంత్ కిషోర్‌ నమ్మకంగా చెప్పారు.

అధికారంలోకి రాగానే అవినీతిపరులైన రాజకీయనాయకులను, అధికారులను ఏరి పారేసి బీహార్‌ని సమూలంగా ప్రక్షాళన చేసి అభివృద్ధిపదంలో నడిపిస్తామని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. 

బీహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్: పోలింగ్: నవంబర్‌ 6,11 తేదీలలో; ఓట్ల లెక్కింపు, ఫలితాలు: నవంబర్‌ 14న.


Related Post