మావోయిస్ట్ సామ్రాజ్యం తుడిచి పెట్టేసినట్లేనా?

October 17, 2025
img

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టగా వందల మంది ఎదురు కాల్పులలో చనిపోగా, మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు అనేక వందల మంది పోలీసులకు లొంగిపోతున్నారు. మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (60) గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోగా, నేడు మావోయిస్ట్ అగ్రనేత తక్కళ్ళ పల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్‌తో సహా సుమారు 200 మంది అనుచరులతో కలిసి నేడు పోలీసులకు లొంగిపోబోతున్నారు. ఇంతకాలం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలోని దట్టమైన అడవులలో ఉంటున్న వారందరూ గురువారం రాత్రి ఇంద్రావతి నది దాటి బైరాంఘడ్ చేరుకున్నారు. 

పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు బస్సులలో వారందరూ జగదల్ పూర్ చేరుకున్నారు. నేడు ఆశన్నతో సహా వారందరూ చత్తీస్‌ఘడ్ సిఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో పోలీసులకు లొంగిపోబోతున్నారు. మంచిర్యాల జిల్లా మండమర్రికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ (54) కూడా నేడో రేపో పోలీసులకు లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఆశన్న మీడియాతో మాట్లాడుతూ, “మేము ఆయుధాలు మాత్రమే వదిలాము... పోరాటాలు కాదు. ఇకపై ‘మూలవాసి బచావో మంచ్’ ద్వారా చట్టబద్దంగా పోరాటాలు కొనసాగిస్తాము. దానిపై చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని కోరాము. మేము సాయుధ పోరాటాలు విరమించాము తప్పితే పోరాటాలు కాదు. కానీ మేము ఏ రూపంలో మా పోరాటాలు కొనసాగించాలన్నా ప్రాణాలతో ఉండటం చాలా ముఖ్యం కనుకనే లొంగిపోతున్నాము,” అని ఆశన్న అన్నారు.


Related Post