వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ళు కుచ్చుటోపీ

October 17, 2025
img

రోజుకో కొత్త రకం సైబర్ నేరాలు జరుగుతుంటే వాటి గురించి పోలీసులు ప్రతీరోజూ సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో ఎవరో ఒకరు చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వృద్ధురాలికి వాట్సప్ కాల్ వచ్చింది. 

ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి తన పేరు స్టీవ్ అని, తానొక వైద్యుడినని, లండన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాని చెప్పాడు. ఇక్కడ లండన్‌లో ఉంటున్న మీ కుమారుడుకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడని, అతని తలకి బలమైన గాయం అవడంతో పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పాడు. మీ కుమారుడికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని లేకుంటే బ్రతకడని చెప్పాడు. దాంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. 

కుమారుడి శస్త్ర చికిత్స కోసం ఆమె అతను చెప్పిన నంబరుకి విడతల వారీగా రూ.35.23 లక్షలు పంపించింది. ఇంకా డబ్బు పంపాలని మళ్ళీ అతను ఫోన్‌లో చేసినప్పుడు తన కుమారుడి ఫోటో, వీడియో పంపించాలని వేడుకుంది. దాంతో ఆ వ్యక్తి ఫోన్‌ కట్ చేశాడు.

ఆమెకు అనుమానం కలిగి కుమారుడికి ఫోన్‌ చేయగా అతను వెంటనే స్పందిస్తూ నేను క్షేమంగానే ఉన్నానని ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పాడు. దాంతో తాను మోసపోయానని ఆమె గ్రహించి సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు . సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Related Post