గత 10 రోజులుగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండ మురళి రోజూ వార్తలలో నిలుస్తున్నారు. మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి జోక్యంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న మాటలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మంత్రి సురేఖ ఓఎస్‌డీ సుమంత్ సిమెంట్ కంపెనీల యజమానులను బెదిరించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను డ్యూటీ నుంచి తొలగించడంతో కొండా దంపతులు తీవ్ర ఆగ్రహం చెందారు.
అజ్ఞాతంలో వెళ్ళిపోయిన సుమంత్ కోసం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి రావడం, అప్పుడు వారి కుమార్తె సుస్మిత సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంతో ఈ యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.
ఈ నేపధ్యంలో నేడు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రి సురేఖ హాజరు కాకపోవచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె మంత్రివర్గ సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తాజా సమాచారం. ఆమె నేరుగా సిఎం రేవంత్ రెడ్డికి ఈ సమస్యని వివరించి వివరణ ఇచ్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోపక్క కొండా మురళి కూడా వెనక్కు తగ్గినట్లే ఉన్నారు. తమ కుమార్తె సిఎం రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడిందో తనకు తెలియదని, ఆమెకు పార్టీతో, ప్రభుత్వంతో ఎటువంటి సంబంధమూ లేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో తాను మొట్ట మొదటివాడినని, అటువంటిది తాను ఆయనని ఎందుకు విమర్శిస్తానన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి పట్ల తనకు చాలా గౌరవం, నమ్మకం ఉన్నాయన్నారు. కొండా దంపతులు ఇద్దరూ ఈవిదంగా వెనక్కు తగ్గడం మంచి నిర్ణయమే. నేడు మంత్రి సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యి వివరణ ఇచ్చుకుంటే ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో?