జాగృతి జనం బాట... కేసీఆర్‌ ఫోటో మిస్సింగ్!

October 15, 2025


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. కనుక నేడు జాగృతి కార్యాలయంలో ఆ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో కేసీఆర్‌ ఫోటోకి బదులు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి ఫోటోలు పెట్టుకున్నారు. 

“నేను బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని చెప్తే ఏదో తప్పుగా మాట్లాడినట్లు చూశారు. ఆ పేరుతో రాజకీయాలు చేస్తున్నానని భావించి పార్టీ నుంచి బయటకు గెంటేశారు.

కానీ అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ కూడా నేను అదే మాటకు కట్టుబడి ఉన్నాను. ఉంటాను. సామాజిక తెలంగాణ సాధన కోసం ప్రజల వద్దకే వెళ్తాను. అన్ని వర్గాల ప్రజలని కలిసి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటాను.

సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, సమాన న్యాయం సాధించడం కోసమే నా ఈ ప్రయత్నం. కలిసి వచ్చేవారితో ముందుకు సాగుతాను ,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 

ఆమె తండ్రిని, బీఆర్ఎస్‌ పార్టీని వదులుకోవడం నిజమే అయితే ఈ జనం బాటలో విమర్శలు గుప్పించక తప్పదు. కానీ విమర్శిస్తే ఎక్కడికక్కడ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. తండ్రిని, పార్టీని విమర్శించకపోతే ఆమెను ప్రజలు ఎన్నటికీ నమ్మరు. ఏదో రోజు ఆమె మళ్ళీ గులాబీ కారెక్కి గులాబీ గూటికే చేరుకుంటారని భావించవచ్చు. కనుక ఆమె జనం బాట ఎలా సాగుతుందో చూడాలి.


Related Post