సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ వాటి ద్వారా లభించే ఆదాయం కోసం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. కానీ అదే సోషల్ మీడియా ద్వారా సమాజానికి, దేశానికి ఎంతో మేలు చేస్తున్నవారు కూడా ఉన్నారు.
కానీ మంచి కంటే చెడుకే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. కనుక ఎవరికీ తోచినట్లు వారు రీల్స్ చేసి అప్‌లోడ్ చేసేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో అనేకమంది అభం శుభం తెలీని చిన్న పిల్లలతో కూడా పిచ్చిపిచ్చి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇటువంటి వీడియోలపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఘాటుగా హెచ్చరించారు. వ్యూస్, లైక్స్ మాయలో పడి నైతిక విలువలు మరిచి, సమాజానికి, చిన్నారులకు కూడా ఇబ్బందికరమైన, అసభ్యకరమైన వీడియోలు చేసి పోస్ట్ చేస్తే సహించబోమని హెచ్చరించారు. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయవద్దని హితవు పలికారు.
పిల్లల చేత అభ్యంతరకరమైన వీడియోలో చేయించడం బాలల హక్కులను, జువైనల్ చట్టాలను ఉల్లంఘన కింద పరిగణించి కటిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు కూడా అటువంటి వీడియోలు చూడవద్దని, లైక్స్ ఈయవద్దని, వీలైతే హెల్ప్ లైన్: 1930కి లేదా సైబర్ క్రైం పోర్టల్‌కి వాటిని పంపించి పిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రేపటి పౌరులైన చిన్నారులను ఇటువంటి వాటి నుంచి కాపాడుకోవడం సమాజంలో ప్రతీ ఒక్కరి బాధ్యత అని వీసీ సజ్జనార్ హితవు పలికారు.