కొండా సురేఖ ఉద్వాసన తప్పదా?

October 16, 2025


img




మంత్రి కొండా సురేఖకు మంత్రివర్గంలో నుంచి త్వరలో ఉద్వాసన తప్పదా?అంటే అవుననే అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. మేడారం అభివృద్ధి పనుల టెండర్లలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకోవడంపై కొండా దంపతులు అభ్యంతరం తెలుపుతూ, మీడియాతో బహిరంగంగా మాట్లాడటం, కాంగ్రెస్‌ అధిష్టానానికి పిర్యాదు చేస్తూ లేఖలు వ్రాయడంతో ఈ చిచ్చు రాజుకుంది. 

ఆమె ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ) సుమంత్ స్థానిక సిమెంట్ కంపెనీ యజమానులను బెదిరించారనే పిర్యాదులు రావడంతో ప్రభుత్వం నిన్న ఆయనని విధులలో నుంచి తొలగించడంతో కొండా కుటుంబం ఆగ్రహంగా ఉంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సుమంత్ కోసం నిన్న రాత్రి వరంగల్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి సురేఖ ఇంటికి వచ్చారు. కొండా దంపతుల కుమార్తె సుస్మిత బయటకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగడంతో వారు తిరిగి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆమె సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీలో రెడ్లు అందరూ ఏకమై బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖని తొక్కేస్తున్నారని ఆరోపించారు. సుమంత్ పేరుతో కేసు నమోదు చేయించి తన తండ్రి కొండా మురళిని అరెస్ట్‌ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించేందుకు ముగ్గురూ కుట్ర చేస్తున్నారని కొండా సుస్మిత ఆరోపించారు. 

ఇప్పటికే ఆమె వలన పలుమార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు సుస్మిత నేరుగా సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంతో ఈ గొడవలు పరాకాష్టకు చేరినట్లే. కనుక మంత్రి కొండా సురేఖకు త్వరలో ఉద్వాసన తప్పక పోవచ్చు.


Related Post