బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగబోతోంది. ఆయన సతీమణి మాగంటి సునీతని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆమె షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమెతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వారిద్దరూ ఇంకా నామినేషన్ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్స్ వేసినట్లు సమాచారం.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భూసేకరణని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల నుంచి సుమారు వంద మంది రైతులు ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నామినేషన్స్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అంతమంది నామినేషన్స్ వేసినట్లయితే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.