పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మద్య జరుగుతున్న ఘర్షణలు నానాటికీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా పాక్ వాయుసేన దాడిలో ముగ్గురు యువ అఫ్ఘన్ క్రికెటర్స్‌తో పాటు 8 మంది పౌరులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాక్ వాయుసేన అఫ్ఘనిస్తాన్‌లోని ఈస్టర్న్ పాక్టికా ప్రావిన్స్‌పై దాడి చేసింది. అక్కడ ఓ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళ్ళిన హరూన్, కబీర్ అఘా, సిగ్బుతుల్లా ముగ్గురు క్రికెటర్లు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు పాక్ దాడి చేయడంతో చనిపోయారు.
తమ దేశంపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తుండటాన్ని అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.
అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకతో జరిగే ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తమ క్రికెటర్లు, పౌరుల మృతికి కారణమైన పాకిస్తాన్ ఈ సిరీస్‌లో పాల్గొంటున్నందునే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.