ఘనంగా ముగిసిన సమక్క సారలమ్మ జాతర

February 01, 2026
img

లక్షలాది మంది భక్తులతో మేడారంలో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన సమక్క సారలమ్మ మహా జాతర శనివారం రాత్రి వనదేవతల వన ప్రవేశంతో ముగిసింది. లక్షలాది మంది భక్తులు జేజేలు పలుకుతుండగా, పూజారులు గద్దెలపై కొలువైన వనదేవతలకు మంగళ హారతులు ఇచ్చారు. 

ఆ తర్వాత గిరిజనులు డోలు, కొమ్ముబూరలు ఊదుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వనదేవతలను వన ప్రవేశం చేయించారు. వేలాది మంది భక్తులు తరలిరాగా ఆలయ పూజారులు వన దేవతలను వారి వారి పూర్వ స్థానాలకు చేర్చారు. మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మహా జాతర పూర్తవడంతో మేడారంలో రద్దీ వేగంగా తగ్గుతోంది. అదివారం సాయంత్రానికి మేడారం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఈసారి ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ట్రాఫిక్ అదుపు తప్పింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనుక ఈ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది జరుగబోయే మేడారం మినీ జాతరకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తారని ఆశిద్దాం.

Related Post