అమ్మ కోసమే జీవితం.. అమ్మ వల్లనే ముగింపు!

February 03, 2026
img

ఓ తల్లి తన పిల్లల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం అవుతుంది. ఎన్ని కష్టాలైన భరిస్తుంది. కానీ ఈరోజుల్లో ఎంత మంది పిల్లలు తమ తల్లి తండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు? అంటే సమాధానం దొరకదు. 

కానీ హైదరాబాద్‌లో ఓ యువతి మానసిక స్థితి బాగోలేని తన తల్లిని చంటిబిడ్డలా కాపాడుకుంది. కానీ ఆ తల్లి కారణంగానే ఆత్మహత్య చేసుకుంది!

కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నీవాల్ విజయలక్ష్మి (26)కి చిన్నప్పుడే తండ్రి చనిపోగా తల్లి సరస్వతికి మతిస్థిమితం లేదు. కానీ విజయలక్ష్మి తల్లిని చంటిబిడ్డలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నత చదువులు చదివింది. ఓ ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. కూకట్‌పల్లి మైత్రీ నగర్‌లో వారివురు నివాసం ఉంటున్నారు.

ఇటీవల ఆమెకు బంధువుల ద్వారా రెండుమూడు వివాహ సంబంధాలు వచ్చాయి. అయితే తల్లికి మతిస్థిమితం లేదు కనుక ఆమె తనతో ఉంటుందని విజయలక్ష్మి చెపుతుండటంతో అందుకు అవతలివారు ఇష్టపడటం లేదు. దాంతో ఆమె పెళ్ళి జరగడం లేదు. దీంతో తీవ్ర నిరాశానిస్పృహలకు లోనైన విజయలక్ష్మి శనివారం సాయంత్రం ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని ట్యాంక్ బండ్‌కు వెళ్ళింది.

అక్కడ కొన్ని గంటలు గడిపిన తర్వాత హుస్సేన్ సాగర్‌లో దూకి చనిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విజయలక్ష్మి ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె సమీప బంధువు అభిషేక్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

ఈలోగా అదివారం ఉదయం ఆమె శవం తేలింది. ట్యాంక్ బండ్‌ పోలీసులు ఈ విషయం కూకట్‌పల్లి పోలీసులకు తెలియజేశారు. వారు అభిషేక్‌ని వెంటపెట్టుకొని వచ్చి చనిపోయింది విజయలక్ష్మే అని నిర్ధారణ చేశారు. 

తాను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే తల్లి ఒంటరి అవుతుందని విజయలక్ష్మి దిగులుపెట్టుకునేదని అభిషేక్ చెప్పారు. కానీ ఆ తల్లి కారణంగానే ఆత్మహత్య చేసుకొని మతిస్థిమితం లేని ఆమెను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Post