కేసీఆర్‌ ఒక్కరే తెలంగాణ సాధించారా? రేవంత్ ప్రశ్న

February 03, 2026


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఒక్కరే పోరాడి సాధించినట్లు బీఆర్ఎస్‌ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. తెలంగాణ కోసం వందల మంది బలిదానాలు చేసుకున్నారు. సర్వస్వం కోల్పోయిన వారున్నారు. 

అన్ని పార్టీలను, ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం పోరాడారు. కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఆయనతో సహా తెలంగాణ కోసం పోరాడిన వారిని దూరం పెట్టారు. ఆయన తన ఇంట్లో నిరాహార దీక్ష చేసుకుంటుంటే పోలీసులను పంపించి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయించారు. తెలంగాణ కోసం పోరాడిన ఆయనకు మా ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతే దానినీ మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అడ్డుకున్నారు.   

మీరు పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోలేదు. కానీ సొంత కుటుంబ సభ్యులందరికీ పదవులు, అధికారం పంచి పెట్టారు. అందరూ కలిసి పదేళ్ళలో రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకొని వేలకోట్ల ఆస్తులు, వందల ఎకరాలలో ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు. 

మహాత్మాగాంధీజీని దేశ ప్రజలు జాతిపితగా గౌరవిస్తున్నారు. కానీ మీకు మీరు జాతిపిత టైటిల్స్ ఇచ్చేసుకుని ప్రజలని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చేయకూడని తప్పులన్నీ చేసిన మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? “ అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


Related Post