ఫోన్ ట్యాపింగ్ కేసులో అదివారం మధ్యాహ్నం 3 గంటలకు బంజారా హిల్స్, నండీ నగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని నోటీస్ ఇచ్చింది. దీనిపై కేసీఆర్ తన న్యాయవాదులతో, పార్టీ ముఖ్య నేతలతో ఫామ్‌హౌసులో సుదీర్గంగా చర్చించారు. కనుక రేపు విచారణకు హాజరవుతారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుతో సహా పలువురిని ప్రశ్నించి వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. కనుక ఒకవేళ రేపు కేసీఆర్ విచారణకు హాజరయితే వారందరూ చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతైన ప్రశ్నలు సందించే అవకాశం ఉంటుంది. కనుక కేసీఆర్ చాలా ఆచితూచి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ నేర్పు ఆయనకు ఉంది.
కానీ సిట్ విచారణకు హాజరయితే అది ఇక్కడితో ఆగేది కాదు. మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురికీ ఇదే చెప్పి పంపించారు.
కనుక కేసీఆర్‌కి మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఖాయమనే భావించవచ్చు. అందుకు కేసీఆర్ సిద్దమైతే రేపు విచారణకు హాజరవుతారు. లేకుంటే రేపు ఉదయమే హైకోర్టులో పిటిషన్ వేసి స్టే కోరినా కోరవచ్చు. మరికొన్ని గంటలలో కేసీఆర్ విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.