మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ మహా జాతర గురించి తెలుసుకున్న బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ గ్యారేత్ విన్ ఓవెన్ శుక్రవారం మంత్రి సీతక్కతో కలిసి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. సాంప్రదాయ చేనేత దుస్తులు ధరించి, వనదేవతలకు బంగారం మొక్కు చెల్లించుకున్నారు.
మహా జాతరకు చేసిన ఏర్పాట్లు, తరలి వస్తున్న లక్షలాది మంది భక్తులను చూసి ఆయన చాలా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు.
ఇదివరకే తాను ఈ మేడారం జాతర గురించి విన్నానని కానీ ఇప్పుడు స్వయంగా పాల్గొని కళ్ళారా చూడగలగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి సీతక్క, అధికారులు ఆయనకు సమ్మక్క సారలమ్మల చరిత్ర, ఆ వనదేవతలతో ముడిపడున్న ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల గురించి ఆయనకు వివరించారు.
ప్రభుత్వం కొత్తగా పాలరాయితో నిర్మించిన రాతి స్థంభాలు, గోడలపై చెక్కించిన ఆదివాసీల బొమ్మల గురించి అయన వారిని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో ఇంత భిన్నత్వం... దానిలో ఇంత ఏకత్వం కళ్ళారా చూసి అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగానని బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ గ్యారేత్ విన్ ఓవెన్ అన్నారు.