హైదరాబాద్ నగరం నడిబొడ్డున కోఠీలో శనివారం ఉదయం తుపాకీ మోత మ్రోగింది. బ్యాంక్ స్ట్రీట్ ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద రషీద్ అనే వ్యక్తి ఏటీఎం మెషిన్‌లో రూ.6 లక్షలు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు.
ఇద్దరు దుండగులు అతనిని వెంబడించి ఏటీఎం గదిలోకి ప్రవేశించినప్పుడు తుపాకీతో కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న రూ.6 లక్షలు తీసుకొని అక్కడే సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్రం వాహనంపై పారిపోయారు.
రషీద్ కాలులో తూటా దిగడంతో గాయపడ్డాడు. ఈ దృశ్యం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతోందని తెలిసి ఉన్నా దుండగులు ఏమాత్రం జంకలేదు. కెమెరాకి సమీపంలో నిలబడి మొహాలకు ముసుగులు ధరించారు. ఈ ఘటన శనివారం ఉదయం 6.30-7.00 గంటల మద్య జరిగినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు అక్కడకు చేరుకొని రషీద్‌ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రషీద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తుంటారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దొంగలను గుర్తింఛి వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.
రషీద్ ఆ సమయంలో డబ్బు జమా చేసేందుకు వస్తున్నట్లు వారికి ఎలా తెలుసు? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బహుశః యూపీ లేదా బిహార్ నుంచి వచ్చినవారి పనే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు.