నిండు పున్నమిలో నిండు జాతర!

January 31, 2026
img

మేడారం సమక్క సారలమ్మ మహా జాతరలో శుక్రవారం రాత్రి లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిండు పున్నమి వెలుగులో గద్దెలపై కొలువైన నలుగురు వనదేవతలు కొలువైనప్పుడు నిండు జాతరగా పరిగణిస్తారు. ఆ సమయంలో వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. 

మేడారంకి చేరుకునే అన్ని మార్గాలతో సహా జంపన్నవాగు నుంచి గద్దెల వరకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనమే. 

రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేసి మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టింది. గద్దెలు, వాటి చుట్టూ ప్రాకారాలు, మళ్ళీ వాటి చూట్టూ 8 ప్రధాన ద్వారాలతో ఆదివాసీల జీవన శైలి, సంప్రాదాయలను ప్రతిభింబించే విధంగా పాలరాయితో స్థంభాలు, ప్రహారీగోడ నిర్మించారు. 

కనుక వనదేవతలను దర్శించుకొని వాటన్నిటినీ కూడా చూడవచ్చనే ఆలోచనతో లక్షల మంది భక్తులు వచ్చారు. బుధవారం మేడారం మహా జాతర మొదలవగా ఈ మూడు రోజుల్లోనే సుమారు 40-50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. 

మూడు నెలల ముందు నుంచి జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల సంఖ్య వారి అంచనాలు మించిపోవడంతో నిన్న ఉదయం నుంచి  రాత్రి వరకు పలుమార్లు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో చిక్కుకుపోయారు. 

అంచనాలకు మించి వాహానాలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలువురు వీఐపీలు ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కొందరు వాహనాలు దిగి కాలినడకన గద్దెలకు చేరుకునే ప్రయత్నం చేశారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వీఐపీ, వీవీఐపీ పాసులను సైతం అనుమతించలేదు.       

ఈరోజు సాయంత్రం వనదేవతల వన ప్రవేశంతో నాలుగు రోజుల మేడారం మహా జాతర ముగుస్తుంది. మళ్ళీ రెండేళ్ళ వరకు వనదేవతలను గద్దెలపై దర్శించుకునే భాగ్యం ఉండదు. కనుక నిన్న ఉదయం నుంచే నుంచే భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. నేడు మరింత పెరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది కోటిన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కానీ ఇప్పుడు భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయలన్నా లేదా అవసరమైన మార్పులు చేర్పులు చేయాలన్నా ఒక్క సెకను కూడా గ్యాప్ లేకుండా ప్రవాహంలో వాహనాలు, భక్తులు తరలివస్తూనే ఉన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరికీ మరో పని చేపట్టేందుకు సమయం సరిపోవడం లేదు. కనుక యధాతధంగానే నిర్వహిస్తున్నారు. 

Related Post