ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతోంది.
ఆనవాయితీ ప్రకారం ముందుగా మంగళవారం తెల్లవారుజామునే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం సమ్మక్క భర్త పగిడిద్దరాజు కొలువైన ఆలయాన్ని కడిగి, ముగ్గులు వేసి తోరణాలు కట్టారు. అనంతరం గ్రామంలో పెనుక వెంకటేశ్వర్లు ఇంటి నుంచి పాన్పు రూపంలో ఉన్న పగిడిద్దరాజుని డోలు వాయిద్యాల, శివసత్తుల నృత్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం పూజారులు పగిడిద్దరాజుని అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు పడగ రూపంలో పెళ్ళి కొడుకుగా ముస్తాబు చేసిన పగిడిద్దరాజుని అక్కడికి 62 కిమీ దూరంలో మేడారానికి కాలి నడకన అడవి మార్గం గుండా బయలు దేరారు. మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి మళ్ళీ ఈరోజు తెల్లవారు జామున కాలి నడకన మేడారం బయలుదేరారు.
ఈరోజే మేడారానికి 3 కిమీ దూరంలో గల కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సారలమ్మ బాజా భజంత్రీలతో ఊరేగింపుగా జంపన్నవాగు గద్దెకు చేరుస్తారు. సారలమ్మ తండ్రి పగిడిద్దరాజుని ఈరోజు సాయంత్రానికి మేడారం గద్దెపై ప్రతిష్టించడంతో మేడారం జాతర మొదలవుతుంది.
తర్వాత ఏటూరు నాగారం మండలంలో కొండాయి గ్రామం నుంచి సమ్మక్క భర్త గోవింద రాజుకి పూజలు చేసి మేడారం తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. చిట్ట చివరిగా మేడారం సమీపంలో గల చిలుకల గుట్ట వద్ద ఆలయం నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కని గురువారం తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు.
సమ్మక్క ఆగమనాన్ని మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టంగా భావిస్తారు. సమ్మక్కని గద్దె వద్దకు తీసుకువస్తున్నప్పుడు జిల్లా ఎస్పీ నాయకత్వంలో పోలీసులు ఆమెకు స్వాగతం పలుకుతూ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతారు.
ఈవిధంగా నాలుగు వేర్వేరు ప్రదేశాల నుంచి వనదేవతలు నలుగురూ ఒకే చోట గద్దెలపైకి చేరుకున్నాక వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
శనివారం సాయంత్రం వనదేవతలు మళ్ళీ వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. కనుక ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.