మేడారం మహా జాతరలో ఈరోజు సాయంత్రం చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కని భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. కనుక గద్దెలపై కొలువైన నలుగురు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దేశంలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నప్పుడు, ములుగు జిల్లావాసులకు ఆ భాగ్యం దక్కాలి కదా? కనుక శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, సంస్థలకు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర సెలవు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆసుపత్రులు, అంబులెన్సులు, మందుల దుకాణాలు, విద్యుత్, అగ్నిమాపక శాఖ వంటి అత్యవసర సేవలు అందించే సిబ్బందికి ఇది వర్తించదు. అలాగే ప్రభుత్వ పాఠాశాలలతో సహా రేపు సెలవు పొందుతున్న సంస్థలన్నీ ఫిభ్రవరి 14న (రెండో శనివారం) పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.