మేడారం గద్దెపైకి తరలివచ్చిన సమ్మక్క

January 30, 2026


img

మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టంగా భావించే సమ్మక్క ఆగమనం గురువారం రాత్రి జరిగింది. పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మునీందర్, వడ్డేల కొక్కెర కృష్ణయ్య పూజరులు గురువారం సాయంత్రం 4 గంటలకు మేడారం సమీపంలో చిలకలగుట్ట సమ్మక్క ఆలయానికి చేరుకొని వనదేవతకు పూజలు చేశారు. 

అనంతరం కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కని భక్తులు ఊరేగింపుగా మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చారు. భక్తులు డోలు, డప్పులు వాయిస్తూ, కొమ్ము బూరలు ఊదుతుంటే గిరిజన మహిళలు సాంప్రదాయబద్దంగా నృత్యాలు చేస్తూ వనదేవతని తోడ్కొని తీసుకువచ్చారు. 

మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, జిల్లా కలెక్టర్ దివాకర, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శిలాజా రామయ్యర్ పలువురు జిల్లా అధికారులు అమ్మవారిని స్వాగతం పలికారు. 

అమ్మవారు రాకని సూచిస్తూ ములుగు జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఏకే 47 రైఫిల్‌తో గాలిలో కాల్పులు జరిపారు. అమ్మవారు చిలకల గుట్ట నుంచి మేడారం గద్దెకు చేరుకోవడానికి సుమారు ఆరు గంటల సమయం పట్టింది. రాత్రి 10 గంటలకు సమ్మక్కని గద్దెపై ప్రతిష్టిస్తున్నప్పుడు భక్తులు జయజయధ్వానాలు చేశారు. 

చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు అమ్మవారి ఊరేగింపులో ఆద్యంతం భక్తులు, ఈ ఊరేగింపు కార్యక్రమం చూస్తున్నవారు కూడా భక్తి పారవశ్యంలో పులకరించారు. 

ప్రభుత్వం ఈసారి మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో రాత్రంతా భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా గద్దెలపై వేంచేసిన వనదేవతలను దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటూనే ఉన్నారు. ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు, వారి అధ్వర్యంలో వేలాదిమంది పోలీసులు ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా వాహనాలను, భక్తులను, క్యూలైన్లను నియంత్రిస్తున్నారు. 

నిన్న ఉదయం నుంచే పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సహా మరింత మంది ప్రముఖులు వనదేవతల దర్శనాలకు రాబోతున్నారు.

మేడారం గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువయ్యారు. రేపు (శనివారం) సాయంత్రం వనదేవతలు వనప్రవేశంతో నాలుగు రోజుల మేడారం మహా జాతర ముగుస్తుంది. కనుక నేటి నుంచి భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.



Related Post