విజయ్‌ దళపతికి ఈ సంతోషం ఇప్పుడు చాలా అవసరమే

January 23, 2026


img

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు)కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ బోర్డ్ ముప్పతిప్పలు పెడుతోంది. దాని కోసం ఆ సినీ పరిశ్రమ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. 

మరోపక్క గత ఏడాది తమిళనాడులోని కరూర్‌ పట్టణంలో విజయ్‌ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. దానిపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆ కేసులో ఢిల్లీలో సీబీఐ చుట్టూ విజయ్‌ తిరుగుతూనే ఉన్నారు. 

ఆయన సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశిస్తుండటం వల్లనే ఈ సమస్యలు చుట్టుముట్టాయి. తమతో పొత్తు పెట్టుకోవాలని ఆయనపై బిజేపి ఒత్తిడి చేస్తోంది. కానీ ఒప్పుకోకపోవడంతో ఇలా వేధిస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెల మద్యలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అంటే ఆయనకి కేవలం 3-4 నెలల సమయం మాత్రమే మిగిలుంది. ఇలాంటి కీలకమైన సమయంలో ఆయన ప్రజల మద్య ఉండాలి. కానీ ఆయన సీబీఐ చుట్టూ, జన నాయకుడు హైకోర్టు చుట్టూ తిరగాల్సివస్తోంది. 

తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఇలాంటి సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ ఆయనకు ఓ శుభవార్త చెప్పింది. అయన టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల చిహ్నంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇదేమీ పెద్ద శుభవార్త కాదు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి చిన్న సంతోషం అవసరమే.


Related Post